Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాయచోటికి పంజాబ్, పుంగనూరుకు బెంగళూరు గ్యాంగులను తెచ్చారు: ధూళిపాళ్ల నరేంద్ర

Dhulipalla Narendra says Punjab gangs brought to Rayachoti and Bangalore gangs to Punganur
Advertisement
  • స్థానిక ఎన్నికల్లో వైసీపీనే ఉద్దేశపూర్వకంగా గొడవలు చేస్తోందన్న నరేంద్ర
  • 2021లో చేసిన అరాచకాలకు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారని వ్యాఖ్య
  • ఎస్ఈసీని తిట్టి మళ్లీ ఆయన దగ్గరకే వెళ్లారని జగన్‌పై విమర్శలు
Advertisement
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో వైసీపీ ఉద్దేశపూర్వకంగానే అలజడులు సృష్టిస్తోందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో అరాచకాలు పెరిగిపోవడం వల్లే 2024 ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు.

రాయచోటికి పంజాబ్ గ్యాంగ్‌ను, పుంగనూరుకు బెంగళూరు గ్యాంగ్‌ను వైసీపీనే తీసుకొచ్చిందని నరేంద్ర ఆరోపించారు. పులివెందులలో ఎంపీ అవినాశ్ రెడ్డి 200 మందితో పోలింగ్ కేంద్రానికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కేవలం ఐదు చోట్ల జరిగిన ఘటనలను రాష్ట్రవ్యాప్త అల్లర్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ తలుచుకుంటే వైసీపీ నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితి ఉండేదని అన్నారు.

పుంగనూరు, పులివెందుల, రాయచోటిలో దశాబ్దాలుగా సాగిన అణచివేత కారణంగానే ఇప్పుడు ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా తిరగబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను దూషించిన జగన్, ఇప్పుడు మళ్లీ ఆయన దగ్గరకే వెళ్లారని ఎద్దేవా చేశారు. 

"వెయ్యి గొడ్డులు తిని నేను శాఖాహారిని అని చెప్పుకునే వ్యక్తిలా జగన్ తీరు ఉంది. తన హయాంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై నీతులు చెబుతున్నారు" అని ధూళిపాళ్ల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగాయని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఫలితాలు రాకపోతే మంత్రి పదవులు, టికెట్లు ఉండవని సొంత పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను బహిరంగంగానే బెదిరించారని నరేంద్రకుమార్ ఆరోపించారు. ఆ బెదిరింపుల ఫలితంగానే రాష్ట్రంలో అపూర్వమైన రీతిలో ఏకగ్రీవాలు జరిగాయని అన్నారు. "2021 ఎన్నికల్లో ఎంపీటీసీల్లో 25 శాతానికి పైగా, జెడ్పీటీసీల్లోనూ అదే స్థాయిలో ఏకగ్రీవాలు అయ్యాయి. ఒక్క కడప జిల్లాలోనే 553 ఎంపీటీసీలకు 439 (దాదాపు 80%), 50 జెడ్పీటీసీలకు 38 (78%) ఏకగ్రీవం కావడం భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఇవన్నీ బెదిరింపులు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లతో సాధించినవే," అని ఆయన గణాంకాలతో సహా వివరించారు.

పులివెందుల, పుంగనూరు, ధర్మవరం, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థులపై వైసీపీ గూండాలు దాడులు చేశారని ధూళిపాళ్ల గుర్తుచేశారు. మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, న్యాయవాది కిశోర్‌ల కారుపై జరిగిన దాడిని ప్రస్తావించారు. "అభ్యర్థులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి, గన్ పెట్టి బెదిరించి నామినేషన్లు విత్‌డ్రా చేయించిన ఘటనలు అనేకం ఉన్నాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఎస్పీలను బదిలీ చేయాలని, పలమనేరు, శ్రీకాళహస్తి, పులివెందులలో డీఎస్పీలపై చర్యలు తీసుకోవాలని అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) సిఫార్సు చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు" అని విమర్శించారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పైనే కులం పేరుతో బురదజల్లి, ఆయన కుటుంబాన్ని బెదిరించారని నరేంద్రకుమార్ ఆరోపించారు. ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాల రక్షణ కావాలని 18.03.2020న హోం సెక్రటరీకి నిమ్మగడ్డ రాసిన లేఖను ఆయన ప్రస్తావించారు. ఆ లేఖలో 35 హింసాత్మక ఘటనలు, 23 బలవంతపు విత్‌డ్రాలు, మొదటి దశలో 55 హింసా సంఘటనలు జరిగినట్లు ఎస్‌ఈసీ స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. టీడీపీతో పాటు బీజేపీ, జనసేన అభ్యర్థులపైనా దాడులు జరిగాయని నివేదించారని గుర్తుచేశారు.

ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పులివెందుల, పలమనేరు, రాయచోటి, పుంగనూరు వంటి ప్రాంతాల్లో వైసీపీ మళ్లీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ధూళిపాళ్ల ఆరోపించారు. "11 సీట్లకే పరిమితమైనా వారిలో మార్పు రాలేదు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అందించిన పాలన చూసి ప్రజలు మాతో నడుస్తున్నారు. ఇది చూసి ఓర్వలేక, విధ్వంసం సృష్టించి ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 2021లో చేసిన పాపాల ఫలితాన్ని ఇప్పుడు అనుభవించబోతున్నారు. ప్రజలు గతాన్ని గుర్తుంచుకొని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు" అని ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Dhulipalla Narendra
YSRCP
Jagan Mohan Reddy
Andhra Pradesh Local Body Elections
Punganur Rayachoti Violence
TDP

More Telugu News